: కొనేవారేరి?... బైక్ల తయారీ నిలిపిన హీరో మోటో, హోండా, బజాజ్, టీవీఎస్
ఇండియాలోని ద్విచక్ర వాహనాల మార్కెట్ లో 90 శాతం వాటా ఉన్న నాలుగు పెద్ద సంస్థలు హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీలు తమ వాహన తయారీ ప్లాంట్లను నిలిపివేశాయి. వార్షిక నిర్వహణా పనుల నిమిత్తం ప్లాంట్లను మూసివేసినట్టు బయటకు చెబుతున్నప్పటికీ, నోట్ల రద్దు తరువాత బైకులకు డిమాండ్ తగ్గి, అమ్మకాలు గణనీయంంగా పడిపోవడం, గోదాముల్లో స్టాక్స్ పేరుకుపోవడంతోనే వాహన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇండియాలో అత్యధికంగా టూ-వీలర్లను విక్రయిస్తున్న హీరో మోటో, వారం రోజుల పాటు ప్రొడక్షన్ నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. స్ప్లెండర్, ప్యాషన్, డ్యూయెట్ బైకుల తయారీని హరిద్వార్, గురుగ్రామ్ ప్లాంట్లలో ఆపేశామని, దారుహెరా ప్లాంటులో మాత్రం పనులు సాగుతున్నాయని పేర్కొంది. ఇక రెండో అతిపెద్ద సంస్థగా ఉన్న హోండా, 10 రోజుల పాటు ప్లాంటులో కార్యకలాపాలు ఆపివేశామని, యాక్టివా, యూనికార్న్ వాహనాల ఉత్పత్తి ఆగిందని తెలిపింది.
ఇక పుణె కేంద్రంలో అవెంజర్, పల్సర్ బైక్ ల తయారీని నిలిపినట్టు బజాజ్ ఆటో తెలిపింది. టీవీఎస్ మోటార్స్ సైతం ఇదే విధమైన ప్రకటన వెలువరించింది. చెన్నైలో అపాచీ బైకుల ప్రొడక్షన్ నిలిపామని, ప్లాంటు నిర్వహణా మరమ్మతుల అనంతరం పనులు తిరిగి ప్రారంభిస్తామని పేర్కొంది. కాగా, 11 నెలల అనంతరం గత నవంబరులో ద్విచక్ర వాహనాల విక్రయాలు 12.4 లక్షలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 6 శాతం తక్కువ. ఇక డిసెంబరు అమ్మకాలు మరింత ఘోరంగా ఉన్నాయని ప్రాథమిక గణాంకాలు చెబుతున్నాయి.