: అక్క‌డ పాతనోట్ల‌కు భ‌లే గిరాకీ.. రూ.500 కి రూ.550, రూ.వెయ్యికి రూ.1100!


పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత ప్ర‌జ‌లంద‌రూ త‌మ వ‌ద్ద ఉన్న పాత నోట్ల‌ను మార్చుకునేందుకు బ్యాంకుల ముందు బారులు తీరారు. దీనిని కొంద‌రు సొమ్ము చేసుకున్నారు. క‌మీష‌న్ల‌పై పాత నోట్ల‌ను తీసుకున్నారు. దేశ‌వ్యాప్తంగా ఈ దందా చాలా జోరుగా సాగింది. కోల్‌క‌తాలోని బుర్రా బ‌జార్‌లోనూ మంచి ఊపుమీద న‌డిచింది. అయితే ఇప్పుడు అదే మార్కెట్లో సీన్ రివ‌ర్స్ అయింది. నెల‌రోజుల క్రితం పాత వెయ్యినోటుకు రూ.800, పాత రూ.ఐదువంద‌ల నోటుకు రూ.300 ఇచ్చి నోట్లు మార్పిడి చేసుకునేవారు. కానీ ఇప్పుడు అక్క‌డ పరిస్థితి పూర్తిగా త‌ల్ల‌కిందులైంది. ఇప్పుడు పాత వెయ్యి నోటుకు రూ.1100, రూ.500 నోటుకు రూ.550 ఇచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. నెల‌రోజుల్లోనే ప‌రిస్థితి ఇలా మార‌డానికి చాలా కారణాలున్నాయి.

షెల్ కంపెనీలు త‌మ బ్యాలెన్స్ షీట్ల‌లో క్యాష్ ఇన్ హ్యాండ్‌ను పెద్ద ఎత్తున చూపించుకునేందుకు ఈ బాట‌ను ఎంచుకున్నాయి. డిసెంబ‌రు 31న ముగిసే మూడో త్రైమాసికం లోపు తాము పెద్ద ఎత్తున లావాదేవీలు నిర్వ‌హించిన‌ట్టు పేప‌ర్ల‌లో చూపించ‌డం ద్వారా త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల‌డ‌బ్బును తెల్ల‌గా మార్చుకునే వ్యూహంలో భాగంగానే ఇలా పాత నోట్ల‌కు డ‌బ్బులు ఎదురిచ్చి కొనుగోలు చేస్తున్నారు.

క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది బ్యాంకులో చూపించ‌ని సొమ్ము. నోట్లు, నాణేల‌ రూపంలో ఉండే ఈ సొమ్మును చిన్న మొత్తాల చెల్లింపుల కోసం ఉప‌యోగిస్తారు. అయితే త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల డ‌బ్బును అధికారికంగా బ్యాంకు ఖాతాలో వేసుకుని తెల్ల‌ధ‌నంగా మార్చుకునేందుకు ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ లావాదేవీలు పెద్ద‌మొత్తంలో జ‌రిగిన‌ట్టు చూపించడ‌మే ల‌క్ష్యంగా ఇలా పాత నోట్ల‌కు ఎదురు క‌మీష‌న్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు బుర్రాబ‌జార్‌లో ఎటుచూసినా కొత్త నోట్లు ప‌ట్టుకుని పాత నోట్ల మార్పిడి చేస్తున్న‌వారే క‌నిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News