: 2030 తరువాత దేశంలో వివాహ వ్యవస్థే వుండదు.. కేవలం సహజీవనమే!: నికీషా పటేల్
బాలీవుడ్ ను ఏలుదామని బ్రిటన్ నుంచి వచ్చిన తనను దర్శకుడు ఎస్జే.సూర్య ఒత్తిడి చేసి మరీ టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు జంటగా 'కొమరం పులి'తో పరిచయం చేశారని సినీ నటి నికీషా పటేల్ చెప్పింది. ఆ సినిమా కోసం చాలా కాలం వెచ్చించానని, అయినా అది ఆశించిన విజయం సాధించక పోవడంతో అవకాశాలు, గుర్తింపు రాలేదని చెప్పింది. ఇప్పుడిప్పుడే తనకు అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. సినిమాల్లోకి వచ్చి ఏడేళ్లు పూర్తి కావడంతో తనను చాలా మంది పెళ్లి గురించి అడుగుతున్నారని చెప్పింది.
ఆడామగా కలిసి జీవించాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నికీషా చెప్పింది. తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదని స్పష్టం చేసింది. తానెవరినైనా ఇష్టపడితే అతనితో సహజీవనం చేసేందుకు సిద్ధమని ప్రకటించింది. అసలు 2030 తరువాత దేశంలోే ఈ వివాహ సంప్రదాయమే ఉండదని సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పుడు కేవలం సహజీవనం మాత్రమే ఉంటుందని, దానిని మనమంతా చూస్తామని చెప్పింది. అంతెందుకు, ఇప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటున్నవారంతా కలిసే ఉంటున్నారా? అని ఎదురు ప్రశ్నించింది. గతంలో తాను అబ్బాయిల్లో అందాన్ని చూసేదాన్నని, ఇప్పుడు మెచ్యూరిటీని చూస్తున్నానని తెలిపింది.