: పోలవరం నిర్మాణంతో ప్రపంచ రికార్డు.. ప్రాజెక్టు పూర్తిచేసి ప్రజల కల నిజం చేస్తా: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టును అత్యంత వేగంగా నిర్మించి ప్రపంచ రికార్డు సృష్టిస్తామని, ప్రజల కలను నిజం చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం నాబార్డు నుంచి తొలివిడత రుణంగా రూ.1981 కోట్ల చెక్కును సోమవారం కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, ఉమాభారతి చేతుల మీదుగా చంద్రబాబు అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరవు ఉండదని, రాయలసీమకు సమృద్ధిగా నీళ్లు వస్తాయని అన్నారు.
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయడంతో ప్రాజెక్టు పూర్తవుతుందనే భరోసా ప్రజల్లో కలిగిందన్నారు. నాబార్డు ద్వారా ఇంత పెద్ద మొత్తంలో నిధులు అందడం గతంలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. పోలవరం ఎత్తును పెంచలేదని, పాత ప్రతిపాదనల ప్రకారమే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి జాతీయ హరిత ధర్మాసనం అనుమతులు అవసరం లేదన్నారు. రాష్ట్రానికి చెందిన కొందరు పెద్దమనుషులు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును అడ్డుకోజూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచ రికార్డు వేగంతో ప్రాజెక్టును నిర్మించి 2019 నాటి కల్లా దీనిని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.