: హైదరాబాద్ రహదారుల్లో కొంత అసౌకర్యం మాట వాస్తవమే: కేటీఆర్
హైదరాబాద్ రోడ్ల విషయంలో కొంత అసౌకర్యం ఉన్న విషయం వాస్తవమేనని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అక్రమనిర్మాణాల వల్ల రహదారులపైకి నీళ్లు వస్తున్నాయని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
వందరోజుల ప్రణాళికపై ఎవరూ డిమాండ్ చేయలేదని, ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతోనే కార్యాచరణ రూపకల్పన చేశామన్నారు. గత ప్రభుత్వాల మాదిరి కాకుండా, హైదరాబాద్ లో రహదారులకు భారీ స్థాయిలో నిధులు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేయాలనే విషయమై ప్రభుత్వానికి స్పష్టత ఉందని, నగర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని, ఇందుకు బీజేపీ సభ్యులు కూడా తమ పరపతి వినియోగించి నిధులు తెచ్చేందుకు సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు.