: నోట్ల రద్దు తరువాత 60 సార్లు మారిన నిర్ణయాలు... కారణం చెప్పిన ప్రధాని మోదీ
నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దును ప్రకటించిన తరువాత, దాదాపు 60 సార్లు ఆర్థిక శాఖ, ఆర్బీఐ తన నిర్ణయాలను మార్చుకోవడం లేదా సవరించడం చేసింది. పదే పదే మారుతున్న నిబంధనల పట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి కూడా. ఇదే విషయమై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశం నుంచి నల్లధనాన్ని, లంచగొండితనాన్ని పారద్రోలాలని ప్రజలంతా భావిస్తున్నారని వెల్లడించిన ఆయన, పదే పదే నిర్ణయాలు మార్చడంపై వివరణ ఇచ్చారు.
"నోట్ల రద్దు తరువాత మేం ఎదుర్కొన్న మరో సమస్య ఇది. నిబంధనలను ఎందువల్ల పదే పదే మార్చారు? అన్న ప్రశ్న ఎదురైంది. కేవలం ప్రజల కోసం, బ్యాంకు ఖాతాదారుల సౌలభ్యం కోసం ఇలా చేయాల్సి వచ్చింది. ఎప్పటికప్పుడు మా నిర్ణయాల అమలుపై ప్రజా స్పందనను తెలుసుకున్నాం. ప్రజలకు కష్టం కలిగించే అంశాలేంటని పరిశీలిస్తూనే ఉన్నాం. అందుకు అనుగుణంగా నిర్ణయాలు మారుస్తూ వచ్చాం. సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతోనే అన్ని సార్లు ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చింది" అని అన్నారు.