: నాబార్డు నుంచి పోలవరం ప్రాజెక్టు చెక్కు రాబోతోంది: ఆనందంగా చెప్పిన చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రూ. 1,981 కోట్ల చెక్కును నేడు అందుకోనున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన అన్నారు. ప్రాజెక్టు నిధుల చెక్కును నాబార్డు నేడు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుందని పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే సమీక్షను ఆయన విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. రాబోయే మూడు నెలల్లో అన్ని జిల్లాల్లో నాబార్డు కింద చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పోలవరంలో రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల ఘనపు మీటర్ల మట్టిని తొలగిస్తున్నామని ఆయన తెలిపారు. డయాఫ్రం వాల్ నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. ప్రాజెక్టు సత్వర నిర్మాణం విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అయినా, వెనుకంజ వేయకుండా ముందుకు సాగుతున్నామని చంద్రబాబు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోను ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులూ సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో ప్రజలు మమేకం కావాలని, ప్రజా సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు.