: ఇచ్చిన మాట తప్పావ్: కేజ్రీవాల్ పై అన్నా హజారే విసుర్లు
ఆమ్ ఆద్మీ పార్టీ వెబ్ సైట్ నుంచి విరాళాలు ఇచ్చిన దాతల వివరాలను తొలగించడంపై సామాజిక ఉద్యమవేత్త అన్నా హజారే విరుచుకుపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట తప్పారని విమర్శించారు. ఈ విషయంలో పార్టీ తప్పు చేసిందని ఎంతో మంది ఆప్ కార్యకర్తలు తనకు చెప్పారని అన్నారు. "పార్టీకి నిధులు అందించే వారందరి వివరాలనూ వెబ్ సైట్ లో ఉంచుతానని నువ్వు ప్రమాణం చేశావు. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు ఇప్పుడు కనిపించడం లేదు. నీ హామీని నువ్వు నిలబెట్టుకోకపోవడం నాకు బాధగా అనిపిస్తోంది. సమాజంలో మార్పును తీసుకువస్తానని చెప్పిన ప్రామిస్ ఏమైంది?" అని కేజ్రీవాల్ ను ఉద్దేశించి రాసిన లేఖలో అన్నా హజారే ప్రశ్నించారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ అన్నా హజారేను తప్పుదారి పట్టించిందని, తమకు నిధులిస్తున్నవారిని వివిధ ఏజన్సీలు వేధిస్తున్నందునే వారి పేర్లు బయటకు కనిపించకుండా చేశామని ఆప్ ట్రెజరర్ రాఘవ్ చద్ధా వ్యాఖ్యానించారు. ఆప్ కు వచ్చే నిధుల్లో 92 శాతం వరకూ నెట్ బ్యాంకింగ్, చెక్కుల రూపంలోనే వచ్చాయని తెలిపారు.