: జయకు గుండెపోటు వస్తుందని ఊహించలేకపోయా.. మరణానికి రెండు రోజుల ముందు కూడా మాట్లాడా: అపోలో చైర్మన్ ప్రతాప్‌రెడ్డి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలితకు గుండెపోటు వస్తుందని తాను ఊహించలేకపోయానని అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి అన్నారు. ఆమె మరణించడానికి రెండు రోజుల ముందు కూడా జయతో మాట్లాడానని పేర్కొన్నారు. జయలలిత ఆస్పత్రిలో చేరిన దగ్గరి నుంచి దాదాపు రెండు నెలలపాటు తాను చెన్నైలోనే ఉన్నానని, ఆమెను దగ్గరుండి పర్యవేక్షించానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను హైదరాబాద్ వెళ్లేముందు జయను పలకరించానని, ఆమె ముఖంపై అదే చిరునవ్వు కనిపించిందని చెప్పుకొచ్చారు. తాను హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చే లోపు నడుస్తారని కూడా చెప్పానని వివరించారు. తిరిగి వచ్చాక డిశ్చార్జి కూడా చేయాలని నిర్ణయించామని, అయితే తాను హైదరాబాద్ నుంచి వచ్చేటప్పటికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
''ఆమెకు గుండెపోటు వచ్చిందని తెలియగానే షాక్ తిన్నా. హృద్రోగ నిపుణుడు ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తున్నా గుండెపోటు రావడంతో ఆవేదన చెందా. వెంటనే ప్రత్యేక వైద్య నిపుణులను రంగంలోకి దింపాం. అంతర్జాతీయ ప్రమాణాలతో చికిత్స అందించాం. వెంటనే ఎక్మో పరికరాన్ని జయకు అమర్చాం. ఈ చికిత్స పొందిన పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ జయ విషయంలో అది సాధ్యం కాలేదు'' అని ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.