demonitisation: ఢిల్లీ, నోయిడాలలో ఐటీ అధికారుల అతిపెద్ద దాడి.. భారీగా నగదు, బంగారం స్వాధీనం
పెద్దనోట్ల రద్దు అనంతరం దేశ వ్యాప్తంగా అధికారులు జరుపుతున్న దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీ, నోయిడాలలోని శ్రీ లాల్ మహల్ లిమిటెడ్ సంస్థ కార్యాలయాలలో విస్తృతంగా తనిఖీలు చేసిన అధికారులు ఇంతవరకు ఎక్కడా గుర్తించనంత భారీ మొత్తంలో బంగారాన్ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ, ఐటీ అధికారులు నిర్వహించిన ఈ దాడిలో ఏకంగా రూ.120 కోట్ల విలువైన 430 కిలోల బంగారం పట్టుబడింది. అంతేగాక, 2.48 కోట్ల పాతనోట్లు, రూ.12 లక్షల కొత్తనోట్లు, 80 కిలోల వెండి, మరో 15 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఆయా ప్రాంతాల్లోని శ్రీ లాల్ మహల్ లిమిటెడ్ అనే కమోడిటీస్ ట్రేడింగ్ కంపెనీ యజమానుల కార్యాలయాలు, ఇళ్లపై ఏక కాలంలో ఈ తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కంపెనీ యజమానులు ప్రత్యేక ఆర్థిక నిబంధనల ప్రకారం డ్యూటీ ఫ్రీ పద్ధతిలో బంగారాన్ని భారీ మొత్తంలో దిగుమతి చేసుకొని ఇంత పెద్ద మొత్తంలో అక్రమార్జన చేశారని అధికారులు తెలిపారు. ఈ కంపెనీల్లో తవ్విన కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయని, ఇవే కార్యాలయాల్లో నడుస్తున్న మరో కంపెనీకి ఇక్కడి నుంచి భారీ మొత్తంలో ఆన్‌లైన్ బదిలీ ద్వారా డబ్బు సరఫరా అయినట్లు అధికారులు చెప్పారు.
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఒక బ్యాంకు ఖాతాలో నగదు జమచేసుకొని, మరో కంపెనీకి బదిలీ చేయడం లాంటి అక్రమాలను ఐటీ అధికారులు గుర్తించారు. ఇలా బదిలీ అవుతున్న నగదు ద్వారానే బంగారు నాణేలను, కడ్డీలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి వీరు కొనుగోలు చేసి, దాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించడానికి సన్నాహాలు చేశారు. ఆ బంగారాన్ని బయటి మార్కెట్లో పాతనోట్లు ఉన్న నల్లకుబేరులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ కేసులో ఇద్దరు అక్రమార్కులను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కాగా కంపెనీ డైరెక్టర్లు తమకు ఆరోగ్యం బాగోలేదంటూ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నారు.