: మంత్రి రావెల‌పై జానీమూన్ చేసిన ఆరోప‌ణ‌ల‌ వెనుక వైసీపీ హస్తం ఉందని అంటారేమో!: అంబ‌టి రాంబాబు సెటైర్


గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ నిన్న మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకున్న అంశంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు టీడీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెట్టారు. ఈ రోజు గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తమ అధికారానికి, అవినీతికి ఎవరు అడ్డొచ్చినా వారిని టీడీపీ నేతలు బెదిరిస్తున్నార‌ని ఆరోపించారు. టీడీపీలో సొంత పార్టీ మహిళా నేతలకే రక్షణ లేకుండా పోతోంద‌ని, రాష్ట్రంలోని ఇత‌ర‌ మహిళలకు రక్షణ ఎలా దొరుకుతుంద‌ని ఆయ‌న అన్నారు. టీడీపీ స‌ర్కారు త‌మ‌ మాట వినని వారిపై కేసులు పెడుతూ వెళుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు.
 
మైనారిటీ వర్గానికి చెందిన మహిళపై టీడీపీ నేతలు దౌర్జన్యాల‌కు దిగితే తాము ఊరుకోబోమ‌ని అంబటి వ్యాఖ్యానించారు. జానీమూన్‌పై మంత్రి రావెల అనుచరులు దాడికి దిగ‌డం ప‌ట్ల పోలీసులు ఎందుకు స్పందించ‌డం లేద‌ని, రావెల‌ను అరెస్టు చేసే ద‌మ్ము పోలీసులకు లేదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. జానీమూన్ ఏం త‌ప్పు చేశార‌ని ఆమెను రావెల అనుచరులు బెదిరించారని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. జానీమూన్ మంత్రి రావెలపై చేసిన వ్యాఖ్య‌ల‌ వెనక త‌మ‌పార్టీ హస్తం ఉంద‌ని టీడీపీ నేత‌లు అంటారేమో అని ఆయ‌న వ్యంగ్యాస్త్రం వదిలారు. వారు ఇటువంటి వ్యాఖ్య‌లు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాంబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ పార్టీకి చెందిన మహిళలకే రాష్ట్రంలో రక్షణ లేనప్పుడు ఇత‌ర‌ మహిళలకు ఎలా రక్షణ ఉంటుందని ఆయ‌న ప్ర‌శ్నించారు. జానీమూన్‌పై జ‌రిగిన దాడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News