roja: ఆడవాళ్ల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు!: టీడీపీపై ఎమ్మెల్యే రోజా ఫైర్
ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీ నేతలపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి నిప్పులుచెరిగారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ... ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు ఆడవాళ్ల మాన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీయా? లేక దొంగల పార్టీయా? దుర్యోధనుల పార్టీయా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలు అన్యాయానికి గురవుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె దుయ్యబట్టారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల కోసం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడం లేదని ఆమె అన్నారు.
గుంటూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ మీడియా ముందు ఎంతో ఆవేదన వ్యక్తం చేసిందని, రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబుతో తనకు ప్రాణహాని ఉందని చెప్పిందని రోజా గుర్తు చేశారు. జానీమూన్ అంతగా భయాందోళనలు వ్యక్తం చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఆమె బాధను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. టీడీపీ మహిళా నేతలు ఇప్పుడైనా స్పందించాలని, సదరు మంత్రిని బర్తరప్ చేయాలని ప్రభుత్వం ముందు డిమాండ్ చేయాలని ఆమె అన్నారు. ఏపీలో మహిళలకు ఎంతగానో అన్యాయం జరుగుతోందని, అయినప్పటికీ టీడీపీ మహిళా నేతలు వాటిపై ఏ మాత్రం స్పందించడం లేదని ఆమె విమర్శించారు.
చిత్తూరులో మేయర్ మృతి చెందినా, రామలక్ష్మిని పలువురు వేధించినా వారు మౌనంగానే ఉన్నారని రోజా అన్నారు. ఇప్పుడు జానీమూన్ లాంటి మహిళల బాధను కూడా పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు సర్కారు రక్షణ ఇవ్వలేకపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కొందరి ఒత్తిడి భరించలేక మెడికోలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, నారాయణ కాలేజీలో ఇప్పటి వరకు ఎంతో మంది విద్యార్థులు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారని, మంత్రి నారాయణను కూడా బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తమ పార్టీకి 175 సీట్లు వస్తాయని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.