demonitisation: మరో ప్రైవేటు బ్యాంకులో నకిలీ ఖాతాలు... భారీగా డిపాజిట్లు!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశంలోని పలు బ్యాంకుల బాగోతాలు బయట పడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలకు తూట్లు పొడిచేలా బ్యాంకర్లు చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడుతూ పట్టుబడుతున్నారు. ఇటీవలే యాక్సిస్ బ్యాంకులో భారీగా అక్రమలావాదేవీలు జరిగినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించిన విషయం విదితమే. తాజాగా, న్యూఢిల్లీలోని కస్తుర్బా గాంధీ మార్గ్‌లో ఉన్న కోటక్ మహేంద్ర బ్యాంకులోనూ అటువంటి అక్రమాలే జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కోటక్ మహేంద్ర బ్యాంకులో నకిలీ ఖాతాలు ఉన్నట్లు వాటిలో సుమారు రూ. 70 కోట్లు జమ అయినట్లు అధికారులు తెలుసుకున్నారు.
సదరు బ్యాంకులో దాడులు నిర్వహించి రమేశ్ చంద్, రాజ్‌కుమార్ అనే వ్యక్తుల నియంత్రణలో డిపాజిట్ అయిన రూ.39 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లకుబేరులు సదరు బ్యాంకు అధికారుల సాయంతోనే ఈ నకిలీ ఖాతాలు ఓపెన్ చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. నల్లకుబేరులు బ్యాంకు ఖాతాల్లో డబ్బు డిపాజిట్ చేసుకోవడమే కాదు.. వాటిని తెల్లడబ్బుగా మార్చుకుంటున్నారు. వారికి బ్యాంకు అధికారులు సాయం అందిస్తున్నారు. రాధికా జెమ్స్ అనే సంస్థ పేరిట ఉన్న మరో నకిలీ ఖాతాలో మరో 36.40 కోట్లు జమ అయినట్లు, పెద్ద ఎత్తున డిమాండ్ డ్రాప్ట్స్ ద్వారా బ్లాక్ మనీని, వైట్ మనీగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్యాంకు అధికారులు మాత్రం మరో వాదనను వినిపిస్తున్నారు. తమ బ్యాంకులో ఎలాంటి అక్రమ లావాదేవీలు జరగలేదని ఖాతాదారుల వద్ద నుంచి కేవైసీ వివరాలు తీసుకున్న తర్వాత వారి నగదును జమ చేసుకుంటున్నామని ఓ ప్రకటన విడుదల చేశారు. తాము ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు.