: ప్రధాని మోదీని కలిసిన ఢిల్లీ మాజీ ఎల్జీ నజీబ్ జంగ్
అందరినీ ఆశ్చర్యపరుస్తూ నిన్న తన పదవికి రాజీనామా చేసిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ ఉదయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో కలసి అల్పాహారం స్వీకరించిన ఆయన, ఆపై ప్రధాని ఇంటికి వెళ్లారు. తనను కలవాలని మోదీ ఆదేశించిన మీదటే, జంగ్ వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్యా జరిగిన చర్చల వివరాలు వెల్లడి కానప్పటికీ, రాజీనామా చేయాలని కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఆయన రాజీనామా చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, జంగ్ రాజీనామాను రాజకీయం చేస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్పీ పార్టీలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. జంగ్ పనిచేస్తున్నంత కాలం ఆయన రాజీనామాను డిమాండ్ చేసిన వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని, అసలు ఆప్, కాంగ్రెస్ సమస్య ఏంటని ఆయన ప్రశ్నించారు.