demonitisation: పుస్తకాలు కొనేవారు లేరు ... 40 శాతం అమ్మకాలు పడిపోయిన వైనం!
పెద్దనోట్ల రద్దు ప్రభావంతో చిల్లర కొరత సమస్య ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావం హైదరాబాద్ లో కొనసాగుతున్న జాతీయ పుస్తక ప్రదర్శనలో అమ్మకాలపై కూడా పడింది. ఈ నెల 15న ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి వస్తోన్న పుస్తక ప్రియులు వాటిని కొనడానికి వెనకాడుతున్నారు. ప్రతి రోజూ వేలాది మంది బుక్‌ఫెయిర్‌కు వస్తున్నా పుస్తకాలు కొనేవారు గతంతో పోల్చితే గణనీయంగా తగ్గిపోయారని స్టాళ్లు ఏర్పాటు చేసిన వారు చెబుతున్నారు. 2015లో బుక్‌ఫెయిర్‌లో రోజుకు దాదాపు రూ.లక్ష విలువైన పుస్తకాలు అమ్ముడు పోయేవి.
అయితే, ప్రస్తుతం అప్పటి కన్నా 40 శాతం మేర అమ్మకాలు తగ్గిపోయాయి. అయితే, గతేడాది 350కి పైగా స్టాళ్లు ఏర్పాటు కాగా, ఈసారి 290 స్టాళ్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. వాటి ఎంపికలో ఈ సారి స్క్రీనింగ్ పద్ధతిని పాటించారు. ఈ బుక్ ఫెయిర్‌లో ఎమెస్కో, నవచేతన, నవోదయ, నవతెలంగాణ, అరుణోదయ, వీక్షణం, విశాలాంధ్ర క్లాసిక్స్ వంటి ప్రముఖ బుక్ పబ్లిషింగ్ కంపెనీలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన స్టాళ్లు కూడా దర్శనమిస్తున్నాయి. నగదు కొరత నేపథ్యంలో బుక్ ఫెయిర్‌లో కొన్ని స్టాళ్ల నిర్వాహకులు స్వైపింగ్ మిషన్‌లు, పేటీఎంల ద్వారా చెల్లింపులు చేసుకోవడానికి వాటిని ఏర్పాటు చేసుకున్నారు.
కానీ ఎన్నో స్టాళ్లలో ఈ సదుపాయాలు లేవు. చిల్లర దొరక్క రూ.2 వేల రూపాయలతో వస్తున్నారు. దీంతో వంద రూపాయల బుక్ కి 2 వేల నోటు ఇస్తే 1900 రూపాయల చిల్లర ఎలా ఇస్తామని స్టాళ్ల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. తాము స్వైపింగ్ కోసం అధికారులకు విన్నతులు చేసుకున్నామని, ఈ నెల 26న బుక్‌ఫెయిర్ ముగుస్తుందని, అయినప్పటికీ ఇప్పటి వరకు అవి తమకు అందలేదని స్టాళ్ల నిర్వాహకులు అంటున్నారు. ఈ బుక్ ఫెయిర్‌లో తెలుగు అకాడమీలో 2015లో రూ.5 లక్షలకు పైగా విలువైన పుస్తకాలు అమ్ముడు పోయాయి. అయితే, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.2 లక్షలు మాత్రమే పుస్తకాలు అమ్ముడు పోయాయి. రేపు, ఎల్లుండి సందర్శకుల సంఖ్య పెరుగుతుందని, ఈ రెండు రోజుల్లో అమ్మకాలు కాస్త పెరగవచ్చని స్టాళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్, లోయర్ ట్యాంక్ బండ్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ బుక్‌ఫెయిర్ జరుగుతోంది.