: పొద్దున్నే నజీబ్ జంగ్ ఇంటికి వెళ్లిన అరవింద్ కేజ్రీవాల్
ఆశ్చర్యకరంగా నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన నజీబ్ జంగ్ ను, ఈ ఉదయం సీఎం అరవింద్ కేజ్రీవాల్ కలిశారు. రాజ్ నివాస్ లోని ఆయన నివాసానికి వెళ్లిన కేజ్రీవాల్, ఆపై మీడియాతో మాట్లాడారు. తాను మర్యాద పూర్వకంగానే నజీబ్ జంగ్ ను కలిశానని, ఇందులో మరే ఉద్దేశాలూ లేవని ఆయన స్పష్టం చేశారు. ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారని అన్నారు. తనకెంతో ప్రియమైన విద్యా బోధన రంగంలోకి వెళ్లనున్నట్టు జంగ్ తెలిపారని, ఆయన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని తాను కోరుకున్నానని వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన రాజీనామా వెనకున్న అసలు కారణాన్ని తెలపాలని, ఎల్జీ పదవి నుంచి ఆయన్ను ఎందుకు తొలగించారో మోదీ తెలియజేయాలని డిమాండ్ చేసింది.