: కేసీఆర్ ను ఫాలో అయిన వీహెచ్!
కాంగ్రెస్ సీనియన్ నేత వి.హనుమంతరావు... ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఫాలో కావడం ఏంటి అని అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. ఆయన నిజంగానే కేసీఆర్ ను ఫాలో అయ్యారు.
టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపీ కె.కేశవరావు మనవడి వివాహం నిన్న జరిగింది. ఈ వివాహానికి కేసీఆర్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. పెళ్లిలో కేసీఆర్ కు వీహెచ్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా, "ఏంది సీఎం సాబ్ మాకు కలిసేందుకు టైమే ఇవ్వరు" అని అడిగారు. దీంతో, 'ఇంటికి పోదాం పద, హన్మంతన్నా' అని కేసీఆర్ అన్నారు. దీంతో, కేసీఆర్ ను వీహెచ్ ఫాలో అయ్యారు. అయితే, కేసీఆర్ కారులో ఆయన కుటుంబసభ్యులు ఉండటంతో... కాన్వాయ్ లోని మరో కారు ఎక్కి నేరుగా సీఎం కొత్త నివాసం 'ప్రగతి భవన్'కు వెళ్లారు.
ప్రగతి భవన్ లో 40 నిమిషాల సేపు గడిపారు వీహెచ్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బతుకమ్మకుంటను పరిరక్షించాలని, అంబర్ పేటలో మహాత్మా జ్యోతిరావుపూలే ఆడిటోరియం నిర్మించాలని, ఒక హనుమాన్ వ్యాయామశాలను నిర్మించాలని కేసీఆర్ ను కోరానని తెలిపారు. వెంటనే అడ్వొకేట్ జనరల్ కు ఫోన్ చేసి, బతుకమ్మకుంట గురించి కేసీఆర్ మాట్లాడారని చెప్పారు. మిగిలిన విషయాలలో కూడా సీఎం సానుకూలంగా స్పందించారని... ఆయన ఇచ్చిన హామీలు తనకు సంతోషాన్ని కలిగించాయని తెలిపారు.