: బ్యాంకు ఖాతాల్లో సొమ్ము డెబిట్.. వ్యాలెట్‌లో నిల్.. గగ్గోలు పెడుతున్న పేటీఎం యూజర్లు
పెద్దనోట్ల రద్దుతో ప్రజలు డిజిటల్ బాట పట్టడంతో మొబైల్ వ్యాలెట్లకు గిరాకీ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్, మొబైల్ వ్యాలెట్ల గురించే మాట్లాడుకుంటున్నారు. డిజిటల్ లావాదేవీలపై ఇంకా పూర్తిస్థాయి పట్టులేకపోవడంతో ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా పేటీఎం యూజర్లకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. వారి నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
తమ బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ అవుతున్నా వ్యాలెట్‌లోకి మాత్రం చేరడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. పేటీఎంలో తమ డబ్బులు ఎంతున్నాయో చూసేందుకు కూడా రావడం లేదని చెబుతున్నారు. వ్యాలెట్‌లోని సొమ్మును తిరిగి తమ ఖాతాలోకి మళ్లించుకోవడం కూడా కుదరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లావాదేవీలు చేసిన ప్రతిసారి ఎండ్ అయిపోతున్నాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని కస్టమర్ కేర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
యూజర్ల ఫిర్యాదులపై పేటీఎం అధికార ప్రతినిధి మాట్లాడుతూ సర్వర్‌కు సరిగా అనుసంధానం కాకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయిన సొమ్ము ఏ కారణంగానైనా వ్యాలెట్‌లో జమకాకపోతే 48 గంటల తర్వాత ఆటోమెటిక్‌గా సమస్య పరిష్కారం అవుతుందని వివరించారు.