: అది చూసి నేనే షాకయ్యా... ఇంత సులభమా అని ఆశ్చర్యపోయా!: చంద్రబాబు
డిజిటల్ లావాదేవీలపై తల బద్దలుగొట్టుకుంటున్న వేళ ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని చూసి షాకయ్యానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆధార్‌తో చెల్లింపులు ఇంత సులభమని తెలిసి ఆశ్చర్యపోయానని పేర్కొన్నారు. ఈ విధానం ఇప్పుడు దేశగతినే మార్చివేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో జరుగుతున్న మంత్రులు, కలెక్టర్లు, వివిధ శాఖల అధిపతులతో జరుగుతున్న సమావేశంలో గురువారం చంద్రబాబు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా చవక ధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న చంద్రన్న కానుకలను తీసుకుంటున్న లబ్ధిదారులు ఆధార్ అనుసంధానిత విధానంలో చెల్లింపులు చూసి షాక్‌కు గురయ్యానన్నారు. చెల్లింపులు ఇంత తేలికగా జరుగుతుండడం చూసి ఆశ్చర్యపోయానన్నారు. మొత్తం 15 నిమిషాల్లో పదిమంది లబ్ధిదారులు ఈ విధానంలో కొనుగోళ్లు జరిపారన్నారు.
సమావేశంలో పాల్గొన్న ఎంతమంది ఆధార్ ఆధారిత లావాదేవీలు నిర్వహించారో చేతులెత్తాలని సీఎం కోరగా, సగం మందే చేతులు లేపారు. దీంతో స్పందించిన చంద్రబాబు చేతులెత్తినవారు తమ అనుభవాలు చెప్పాలని కోరారు. చాలామంది ఈ విధానం చాలా తేలికగా ఉందని వివరించారు. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.