: మార్కెటింగ్ శాఖలో కూలీలందరికీ నగదు రహిత లావాదేవీల ద్వారానే డబ్బు చెల్లిస్తున్నాం: హరీశ్‌రావు
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మార్కెటింగ్ శాఖలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తాము పలు చర్యలు తీసుకుంటున్నామని, క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ ను ప్రోత్సహిస్తున్నామని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ రోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ... మార్కెటింగ్ శాఖలో ఓ కొత్త చట్టం తీసుకురావాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్‌యార్డుకు బయట కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా చట్టబద్ధత కల్పించే విధంగా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. మార్కెట్లలో రైతులు విక్రయించిన ధాన్యానికి వచ్చిన రూ.920 కోట్లు నగదును వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశామని తెలిపారు. మార్కెట్లలో మొత్తం 15,399 మంది కూలీలు పనిచేస్తున్నారని, వారికి కూడా క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే కూలీ సొమ్ము చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.