rahul gandhi: నన్ను ఎగతాళి చేసినా ఫర్వాలేదు.. నా ప్ర‌శ్న‌ల‌కు సమాధానం చెప్పాల్సిందే!: మోదీపై మరోసారి రాహుల్ ఫైర్


కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇటీవ‌లే రాహుల్ చేసిన ఆరోపణలకు కౌంట‌ర్ ఇస్తూ, ఆయ‌న‌ మాట్లాడితే భూకంపం రాలేద‌ని, మాట్లాడకపోతేనే వస్తుందని మోదీ ఈ రోజు వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ రోజు రాహుల్ గాంధీ మ‌రోసారి మోదీపై ఫైర్ అయ్యారు. ఈ రోజు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించిన జ‌న్ ఆక్రోశ్ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... మోదీ ఎన్నో మాట్లాడారు కానీ, తాను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మాత్రం స‌మాధానం చెప్ప‌లేద‌ని విమ‌ర్శించారు. 2012, 13లో మోదీ తీసుకున్న ప్యాకేట్ల‌లో ఏముందో చెప్పాల‌ని ఆయ‌న స‌వాలు విసిరారు. త‌న‌ను ఎగ‌తాళి చేసినా ఫ‌ర్వాలేద‌ని, ప్ర‌జ‌ల‌కు నిజాలు చెబితే మాత్రం స‌రిపోతుంద‌ని వ్యాఖ్యానించారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దుతో పేద‌ల‌ను క‌ష్ట‌పెడుతూ మోదీ పారిశ్రామిక వేత్త‌ల‌కు మేలు చేస్తున్నార‌ని రాహుల్ గాంధీ అన్నారు. క్యూలైన్ల‌లో నిల‌బ‌డుతున్న‌వారు అక్ర‌మాల‌కు పాల్ప‌డి డ‌బ్బు సంపాదించుకున్న వారు కాద‌ని అన్నారు. మోదీ పారిశ్రామిక వేత్త‌ల రుణాల‌ను ర‌ద్దు చేస్తున్నార‌ని, కానీ, రైతుల రుణాల‌ను మాత్రం ర‌ద్దు చేయ‌డం లేద‌ని రాహుల్ గాంధీ ధ్వ‌జ‌మెత్తారు. దేశంలో ప్ర‌తిరోజు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని, ఈ విష‌యంపై తాము ప్ర‌ధాని మోదీని క‌లిస్తే ఆయ‌న నుంచి స్పంద‌నే రాలేద‌ని రాహుల్ ఆరోపించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎంత‌మంది న‌ల్ల‌కుబేరుల‌ను మోదీ జైల్లో పెట్టార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒక్క‌రంటే ఒక్క‌రిని కూడా పెట్ట‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా ల‌లిత్ మోదీ, విజ‌య్ మాల్యాలాంటి వారు దేశం నుంచి పారిపోయార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

  • Loading...

More Telugu News