: సగం మంది కూడా నా ఆదేశాలు పాటించలేదు: రెండో రోజు కలెక్టర్ల సదస్సు ఆరంభంలోనే బాబు అసంతృప్తి
విజయవాడలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండవ రోజు సమావేశాల ప్రారంభ సమయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన ఆదేశాలను సగం మందైనా పాటించలేదని అన్నారు. సమావేశాల తొలిరోజున ఆయన ఓ సూచన చేయగా, కలెక్టర్లు సహా అధికారుల్లో చాలా మంది దాన్ని పాటించలేదని తెలిసినందునే బాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంతకీ విషయం ఏంటంటే, సమావేశం ముగిసిన తరువాత, ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా, ఏ ఖర్చు పెట్టినా కార్డు చెల్లింపులు జరపాలని చంద్రబాబు కోరారట. ఆపై, ఈ ఉదయం గత రాత్రి నిర్వహించిన డిజిటల్ లావాదేవీలపై వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. సగం మంది కూడా తన ఆదేశాలను పాటించలేదని, ఇలాగైతే ప్రజలకు ఆదర్శంగా ఎలా నిలుస్తామని ఆయన ప్రశ్నించారు.