: న్యూ ఇయర్ గిఫ్ట్... టికెట్ చార్జీలను తగ్గించనున్న ఏపీ ఎస్ఆర్టీసీ!


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సర్కారు కొత్త సంవత్సరం కానుకగా ఆర్టీసీ బస్సు చార్జీల ధరలను తగ్గించనుంది. అత్యధికులు ప్రయాణించే గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాల్లో తిరిగే సిటీ బస్సుల ధరలను తగ్గించాలని నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడనున్నట్టు సమాచారం. పల్లెవెలుగు బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో దారుణంగా పడిపోవడం, ఇదే సమయంలో డీజెల్ ఆటోలకు ఆదరణ అధికంగా ఉండటంతో, చార్జీలు అధికంగా ఉన్న కారణంగానే ఆర్టీసీ నష్టపోతోందని తేల్చిన రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, ఎండీ మాలకొండయ్య విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి, ప్రస్తుతం కనీస ధరగా ఉన్న రూ. 6ను రూ. 5కు తగ్గించాలని, రెండు స్టేజీల వరకూ అదే చార్జీని కొనసాగించాలని నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది.

మూడు నుంచి ఆరు లేదా ఏడు స్టేజీల వరకూ రూ. 10 చార్జీని వసూలు చేస్తే, కొంతవరకూ చిల్లర నాణేల కష్టాలు కూడా తగ్గుతాయని వారు భావిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మాలకొండయ్య, అక్కడ అమలవుతున్న విధానాన్ని చూసి, అదే పద్ధతిని ఏపీలోనూ అమలు చేయాలన్న దిశగా కసరత్తు చేశారు. కనీస ధర రూ. 5గా అమలైతే ఆటోలకు బదులు ప్రయాణికులు బస్సులను ఆశ్రయిస్తారని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News