: ఎంత సేపూ మహానేత అంటే సరిపోతుందా? : జగన్ పై జేసీ దివాకర్ రెడ్డి సెటైర్
అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని, దానిని చెడగొట్టుకోవాలన్న ఆలోచిన లేదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణల్లో బతికి బట్టకట్టడం కల్ల అని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందని, ఒకసారి కోమాలోకి వెళ్తే బతికే అవకాశాలు కష్టమని అన్నారు. కాంగ్రెస్ కూడా అంతేనని ఆయన చెప్పారు. తమ పార్టీకి చంద్రబాబు తల అయితే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు కాళ్లు, చేతులని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఎంతసేపూ 'మహానేత' అంటూ చెబుతుంటే సరిపోతుందా? అని ఆయన అన్నారు. విమర్శలు చేయడం మాత్రమే కాదని, వాటికి పరిష్కారాలు కూడా చెప్పాల్సి ఉందని ఆయన అన్నారు.
మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడడండి అంటే, కంపుకొడుతుందని ఆయన చెప్పారు. ఎంతసేపూ పట్టిసీమ, పోలవరం, ఇతర సమస్యల మీద విమర్శలు కురిపించడమే కాకుండా పరిష్కారం ఏం చేస్తావో చెప్పాలని ఆయన జగన్ ని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఎంతసేపూ అధికార పక్షం మీద విమర్శలు చేస్తే గెలిచేస్తామని అనుకోవడం భ్రమేనని ఆయన తేల్చిచెప్పారు. తమ సామాజిక వర్గం జవసత్వాలు ఉడిగిపోయాయని, తమకు సెలైన్ ఎక్కిస్తే సరిపోదని, దేవతలు పానం చేసినది ఉండాలని, అది తన వద్ద లేదని ఆయన చెప్పారు.