: టీడీపీలో ఇప్పుడా పరిస్థితి లేదు!: జేసీ దివాకర్ రెడ్డి
గతంలో ఎన్టీఆర్ ఎవరికి టికెట్లిస్తే వారే గెలిచారని, టీడీపీలో ఇప్పుడా పరిస్థితి లేదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు హైదరాబాదులో వ్యాఖ్యానించారు. తాను 'చంద్రబాబేమన్నా గాంధీనా?' అని అనలేదని స్పష్టం చేశారు. తన మాటలు అధికారులు వినడం లేదన్న ఆందోళన లేదని, తనకు అధికారులంతా సరైన గౌరవమర్యాదలు ఇస్తారని చెప్పారు.
అనంతపురం ఫ్లైఓవర్ విషయంలో పంతానికి పోవడం లేదని ఆయన చెప్పారు. మీడియా వాళ్లు నారద మునులని, చాలా మంది అలాంటి వారే ఉండడంతో మాటలు మారిపోతున్నాయని ఆయన అన్నారు. దివాకర్ రెడ్డి ఫలానా పని చేశాడన్న పేరు తెచ్చుకోవాలన్న కోరిక తనకు ఉందని ఆయన తెలిపారు. సునీతమ్మ (మంత్రి పరిటాల సునీత) ఇంత వరకు తనకు వ్యతిరేకంగా ఎలాంటి పని చేయలేదని, కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదని ఆయన అన్నారు. తనకు సెన్సేషనల్ కామెంట్లు చేయాలన్న కోరిక ఉండదని, నిజాన్ని నిర్భయంగా మాట్లాడతానని ఆయన చెప్పారు. తెలంగాణ విడిపోవడానికి తమ సామాజిక వర్గానికి చెందినవారే కారణమని ఆయన తెలిపారు.