: భారత్ లో బంధించిన నా అభిమానిని విడుదల చేయండి: మోదీని కోరిన పాక్‌ మాజీ క్రికెటర్‌


అసోంలో త‌న అభిమానిని అకార‌ణంగా బంధించార‌ని, అత‌డిని విడిపించాల‌ని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ షాహిద్‌ అఫ్రిది భారత ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞ‌ప్తి చేశాడు. పాకిస్థాన్ జెర్సీ ధరించి క్రికెట్ చూడడానికి వెళ్లిన ఓ భారత క్రికెట్ అభిమానిపై భార‌తీయ యువ‌మోర్చా క‌మిటీ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేసి, జైల్లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. అరెస్ట‌యిన త‌న అభిమాని రిపున్ చౌదరి అంశంపై స్పందించిన అఫ్రిది.. త‌న అభిమానిపై భారత శిక్షా స్మృతి ప్రకారం పలు కేసులు పెట్టి జైలులో వేశారని, ద‌య చేసి అత‌డిని విడుద‌ల చేయాల‌ని అన్నాడు. భారత్‌లో త‌మ దేశ‌ క్రికెటర్లకు అభిమానులు ఉన్నారని, అలాగే, త‌మ దేశంలోనూ భారత క్రికెటర్లకు అభిమానులు ఉన్నారని అఫ్రిది వ్యాఖ్యానించాడు.

అభిమానుల‌ను ఇలా  అరెస్టులు చేయడం భావ్యం కాద‌ని అఫ్రిది అన్నాడు. ఇరు దేశాల్లో వారిని కేవలం క్రికెట్‌ అభిమానులుగా మాత్రమే చూడాలని, స‌మాజంలో సహనాన్ని నాశ‌నం చేసే ఇలాంటి చ‌ర్య‌లు చేయ‌కూడ‌ద‌ని ఆయ‌న పేర్కొన్నాడు. ఇటువంటి వాటిని ఎవరైనా సరే వ్య‌తిరేకించాల్సిందేన‌ని వ్యాఖ్యానించాడు. భార‌త ప్ర‌ధాని ఈ అంశంలో కలగజేసుకొని న్యాయం చేస్తారని తాను కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు.

  • Loading...

More Telugu News