: ట్రిపుల్ సెంచరీ అదృష్టం కాదు...బతకడమే అదృష్టం: కరుణ్ నాయర్
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ట్రిపుల్ సెంచరీ చేసి రికార్డులకెక్కిన కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేయడం అదృష్టం కాదని, తాను బతికుండడమే అదృష్టమని చెబుతున్నాడు. గత జూలైలో కేరళ వెళ్లిన కరుణ్ నాయర్ పంపానదిలో పడవ ప్రయాణం చేస్తుండగా, అకస్మాత్తుగా పడవ మునిగిపోయింది. పడవలో సుమారు వంద మంది ఉన్నారు. చాలా మందికి ఈత వచ్చినా కరుణ్ నాయర్ కు ఈత రాదు. దీంతో భూమిమీద నూకలు చెల్లిపోయాయని అనుకున్నాడు. ఇంతలో ఈత వచ్చిన సహప్రయాణికులు, గజఈతగాళ్లు అతనిని రక్షించారు. నిజానికి అలాంటి ప్రమాదంలో ఈత రాకపోతే మరణించడమేనని, అదృష్టవశాత్తు తాను బతికి బట్టకట్టానని, అంత అదృష్టం ముందు, బతికి ఉండడం కంటే మరో అదృష్టం ఏదీ ఉండదని తెలిపాడు. అందుకే ట్రిపుల్ సెంచరీ కంటే బతికిఉండడమే అదృష్టమని తాను భావిస్తానని తెలిపాడు.