: ఐరాస వేదికగా పాకిస్థాన్ కు భారత్ కఠిన హెచ్చరిక
ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ వేదికగా పాకిస్థాన్ వైఖరిని తీవ్రంగా తప్పుబడుతూ భారత్ కఠిన హెచ్చరికలు జారీ చేసింది. పాక్ భూభాగం కేంద్రంగా పనిచేస్తూ, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, వారికి నీడలా ఉంటూ మద్దతిస్తున్న వారిపైనా కఠినంగా వ్యవహరించాలని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకమంటూనే పాక్ కు అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్న చైనా వైఖరినీ ఆయన తప్పుబట్టారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్ పై ఒత్తిడిని పెంచాలని భారత్ భావిస్తుంటే, చైనా అందుకు మోకాలొడ్డుతోందని అక్బరుద్దీన్ విమర్శించారు. సెక్యూరిటీ కౌన్సిల్ లో సభ్యదేశంగా ఉంటూ పాక్ ఉగ్రవాదులకు చైనా మద్దతిస్తోందని చెబుతూ 2008 ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని చైనా వెనకేసుకుని వస్తుండటాన్ని ఆయన ప్రస్తావించారు.
చైనా అండతో పాక్ రెచ్చిపోతున్నదని, తాలిబాన్లు, హక్కానీ నెట్ వర్క్, దయేష్, అల్ ఖైదా వంటి సంస్థలెన్నో పాక్ కేంద్రంగా పలు దేశాలపై దాడులు చేస్తున్నాయని చెబుతూ, "నా స్నేహితుడా! ఏమాత్రం ఆలోచన ఉన్నా శాంతిని తప్ప మరేవిధమైన ఆలోచననూ మనసులోకి రానీయవద్దు. నీవు నాటుతున్న మొక్కలు ఎలాంటి ఫలాలనూ ఇవ్వవు" అంటూ పర్షియన్ కవి రూమీ మాటలను ఉదాహరిస్తూ అక్బరుద్దీన్ పాక్ కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు.