: మరింత దిగిరానున్న బంగారం ధరలు... అయినా కొనుగోళ్లు అంతంతే!


సమీప భవిష్యత్తులో, ముఖ్యంగా రాబోయే రెండు నెలల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, కొనుగోళ్లు ఆశించినంత సంతృప్తికరంగా ఉండబోవని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తదుపరి సెషన్లలో 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ. 26,700 వరకూ చేరవచ్చని, ఇదే సమయంలో చేతిలో నగదు లేకపోవడం, ఆన్ లైన్ కొనుగోళ్లపై అవగాహనా లేమి కారణంగా అమ్మకాలు తగ్గనున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఖరీఫ్‌ సీజన్‌ పూర్తయిన ప్రస్తుత తరుణంలో, రైతుల వద్ద నగదు చేరకపోవడంతో వివాహాది శుభకార్యాలున్నా, అమ్మకాలు సాగడం లేదని పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ. 30 వేలకు పైగా ఉన్న ధర, ప్రస్తుతం 27,200కు చేరినప్పటికీ కొనేవారు కరవయ్యారని బులియన్ మార్కెట్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు గోల్డ్ లావాదేవీలకు దూరంగా ఉన్నారని సమాచారం. వీరి ఖాతాల్లో డబ్బు ఉన్నప్పటికీ, రోజువారీ ఖర్చులకు అవసరమయ్యే నగదు లభ్యత లేకపోవడం, బ్యాంకుల్లో క్యూలైన్లు, రకరకాల ఇతర భయాలతో కొనుగోలుకు రావడం లేదని తెలుస్తోంది. ఇక అమెరికాలో ఫెడరల్ బ్యాంకు వడ్డీ ధరల మార్పు నిర్ణయం కారణంగా కూడా ధరలు దిగివస్తున్నాయి. ఆభరణాల బంగారం ధర 22 నుంచి 23 వేల రూపాయలకు చేరవచ్చని ఓ హోల్ సేల్ వ్యాపారి అంచనా వేశాడు. ఆ స్థాయికి ధరలు దిగజారినా, అమ్మకాలు ఊపందుకునే అవకాశం కనిపించడం లేదని అన్నాడు. ఇదే సమయంలో చిన్న చిన్న కొనుగోళ్లు పెరగవచ్చని భావిస్తున్నట్టు తెలిపారు.

కాగా, మంగళవారం నాటి సెషన్లో బంగారం ధర 10 గ్రాములకు క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 141 తగ్గి రూ. 27,119 (ఫిబ్రవరి 3 డెలివరీ)కు చేరగా, వెండి ధర రూ. 216 తగ్గి రూ. 39,217 వద్ద కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News