: సభలో ఎమ్మెల్యే ‘పరుగో పరుగు’.. త్రిపుర అసెంబ్లీలో తమాషా ఘటన
త్రిపుర అసెంబ్లీలో వింత ఘటన చోటుచేసుకుంది. చిన్న పిల్లల కోసం రూపొందించే యానిమేషన్ సీన్లలా త్రిపురలో జరిగిన ఈ ఘటన అందరికీ నవ్వు పుట్టిస్తోంది. టీఎంసీకి చెందిన సభ్యుడు సుపిడ్ రాయ్ బార్మన్ సభలో పోడియం వద్దకు దూసుకెళ్లి స్పీకర్ అధికార దండాన్ని లాక్కొని పారిపోయారు. ఈ సమయంలో ఆయనను సభలోని సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అతడి నుంచి ఆ దండాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించారు. అయితే, అందరి నుంచి తప్పించుకున్న సదరు ఎమ్మెల్యే సభలో పరుగులు పెట్టి బయటకు వెళ్లిపోయారు. అతడిని బయట మార్షల్స్ పట్టుకొని స్పీకర్ అధికార దండాన్ని తిరిగి తెచ్చారు.
సభలో నుంచి దండాన్ని లాక్కొని పరిగెత్తుతున్నప్పుడు సదరు ఎమ్మెల్యే వెంటే మరో సభ్యుడు కూడా పరుగులు తీశారు. సభ ద్వారం వరకు ఆయన వెనకాలే పరిగెత్తినప్పటికీ ఆ దండాన్ని తిరిగి లాక్కోలేకపోయారు. అసెంబ్లీలో తృణమూల్ ఎమ్మెల్యే చేసిన ఈ అతి ప్రవర్తన పట్ల ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆ తరువాత ఆయన ఈ ఘటనపై క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. తాను సభలో డిమాండ్ చేస్తోన్న అంశంపై చర్చ చేపట్టేందుకు నిరాకరించినందుకే సదరు ఎమ్మెల్యే ఇలా ప్రవర్తించారు.