: బీ కేర్‌ఫుల్! బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేశారో.. రూ.10 వేలు జరిమానా కట్టాల్సిందే!
జాగ్రత్త.. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే పదివేల రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ హెచ్చరించింది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల(2016) ప్రకారం చెత్తాచెదారాన్ని సేకరించి నిర్దేశిత ప్రాంతానికి తరలించే బాధ్యత అధికారులదేనని ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. మునిసిపల్ ఘన వ్యర్థాలు, చెత్తాచెదారం సమస్యలు ఢిల్లీలోనే అధికమని పేర్కొంది.
చెత్తాచెదారం విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తే ప్రజారోగ్యానికి ఎటువంటి హానీ ఉండదని తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, కూరగాయల మార్కెట్లు, వధశాలలు నిబంధనల మేరకు చెత్తాచెదారాన్ని తొలగించుకోవాలని పేర్కొంది. తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు వేరుచేసి తరలించాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పడేస్తే రూ.10వేలు జరిమానా కట్టాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో ఘన వ్యర్థాల నిర్వహణ తీరుపై దాఖలపై పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ స్వతంత్ర కుమార్ సారథ్యంలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఈ ఆదేశాలు జారీ చేసింది.