: వెల్ కమ్ టు 300 క్లబ్!: కరుణ్ నాయర్ కు గేల్ కితాబు
ఒకేఒక్క ఇన్నింగ్స్ కరుణ్ నాయర్ పేరును అంతర్జాతీయ క్రికెట్ లో మార్మోగేట్టు చేసింది. ఇంగ్లండ్ సిరీస్ తో అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ కు చెన్నైలోని చెపాక్ స్టేడియం అన్ని విధాలా కలిసివచ్చినట్టు కనిపిస్తోంది. ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అన్ని రకాల స్వీప్ షాట్లు ఆడిన కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. దీంతో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ట్రిపుల్ సెంచరీకి ఆద్యుడైన వీరేంద్ర సెహ్వాగ్ 12 ఏళ్లుగా ఈ క్లబ్ లో ఒక్కడినే ఉన్నానని, మరో భారతీయుడు తోడుంటే బాగుంటుందని భావించానని, ఇప్పుడు నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. వెంటనే వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ స్పందించాడు. '300 క్లబ్ లోకి కుర్రాడికి స్వాగతం... సూపర్ ఇన్నింగ్స్ ఆడావు' అంటూ కితాబునిచ్చాడు. కాగా, సెహ్వాగ్ లానే గేల్ కూడా రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.