: పెద్ద నోట్ల రద్దు నాటికి ఆర్బీఐ దగ్గరున్న 2,000 నోట్లెన్నో తెలుసా?
నల్లధనం నియంత్రణకు 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆరు నెలలుగా దీనిపై సుదీర్ఘ చర్చలు జరిపామని, సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు పెద్దనోట్లను రద్ద చేస్తున్నామని, రద్దు చేసిన మేరకు కొత్త నోట్లను సిద్ధంగా ఉంచామని, ఈ నెల పదవ తేదీ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాల్లో కొత్త నోట్లు అందుబాటులోకి వస్తాయని, చిన్న చిన్న ఇబ్బందులుంటాయని, 50 రోజులపాటు ప్రజలు సహకరించాలని, దేశం కోసం త్యాగాలు చేయాలని ప్రధాని సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబయికి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త అనిల్ గాల్గాలి ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రద్దు చేసిన నాటికి ఆర్బీఐ వద్ద ఎంత మొత్తం కొత్త నోట్లు ఉన్నాయో లెక్క కావాలంటూ దరఖాస్తు చేశారు.
ఆయన దరఖాస్తుకు ఆర్బీఐ బదులిచ్చింది. నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయంతో చలామణిలో ఉన్న 9.13 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన వెయ్యి రూపాయల నోట్లు, 11.38 లక్షల కోట్ల రూపాయల విలువైన 500 రూపాయల నోట్లు రద్దయ్యాయని ఆర్బీఐ తెలిపింది. అప్పటికి ఆర్బీఐ ముద్రించిన 2 వేల రూపాయల నోట్ల సంఖ్య 2,473 మిలియన్లు అంటే వాటి విలువ 4.94 లక్షల కోట్ల రూపాయలని తెలిపింది.