: తొలి సెంచరీ వరకు ఒత్తిడి ఉంది...తరువాత అంతా స్వేచ్ఛే: కరుణ్ నాయర్
భారీ ఇన్నింగ్స్ ఆడడం ఆనందంగా ఉందని కరుణ్ నాయర్ తెలిపాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 303 పరుగులు సాధించిన అనంతరం కరుణ్ నాయర్ మాట్లాడుతూ, కేఎల్ రాహుల్ తనపై ఒత్తిడి లేకుండా చేశాడని అన్నాడు. తొలుత రాహుల్ సహకారంతో ఇన్నింగ్స్ నిర్మించిన తాను, తరువాత బేసిక్స్ కు కట్టుబడి ఆడానని చెప్పాడు. కెరీర్ లో తొలి సెంచరీ సాధించే క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని చెప్పాడు. దీంతో రాహుల్ తో పాటు క్రీజులో ఉన్నంత సేపు జాగ్రత్తగా ఆడానని చెప్పాడు. తరువాత దురదృష్టవశాత్తు డబుల్ సెంచరీ సాధించకుండా 199 పరుగుల వద్ద రాహుల్ అవుటయ్యాడని అన్నాడు. అది బ్యాడ్ లక్ అని, త్వరలోనే రాహుల్ డబుల్ సెంచరీ చేస్తాడని కరుణ్ నాయర్ చెప్పాడు.
తొలి సెంచరీ సాధించిన తరువాత ఒత్తిడి పోయిందని తెలిపాడు. రవిచంద్రన్ అశ్విన్ (67) అవలీలగా ఆడుతుండడంతో తన ఆటతీరును మార్చానని అన్నాడు. దీంతో డబుల్ సెంచరీకి చేరువయ్యానని, జడేజా (51) క్రీజులోకి వచ్చిన తరువాత జడ్డూ దూకుడు పెంచడంతో తన ఆట గేర్ మార్చానని అన్నాడు. దీంతో ట్రిపుల్ సెంచరీ సాధించానని తెలిపాడు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో ట్రిపుల్ సెంచరీ సాధించడం మరపురాని అనుభూతి అయిందని చెప్పాడు. పిచ్ టర్న్ అవుతోందని, ఇంగ్లండ్ ను అవుట్ చేయడమే తమ లక్ష్యమని కరుణ్ నాయర్ వెల్లడించాడు.