: 11 మంది ఆరెస్సెస్ కార్యకర్తలకు 'డబుల్' జీవితఖైదు!
11 మంది ఆరెస్సెస్ కార్యకర్తలకు కేరళలోని తిరువనంతపురం అడిషనల్ సెషన్స్ కోర్టు డబుల్ జీవితఖైదును విధించింది. డీవైఎఫ్ఐ కార్యకర్త విష్ణు హత్య కేసులో వీరికి ఈ శిక్షను ఖరారు చేసింది. దీనికి తోడు, నిందితులందరికీ రూ. 51 వేల చొప్పున జరిమానా కూడా విధించింది. కేసు వివరాల్లోకి వెళ్తే, ఆరెస్సెస్ వ్యక్తులపై రాజకీయ కక్షసాధింపులో భాగంగా దాడులు చేస్తున్నాడన్న కారణంగా... డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డీవైఎఫ్ఐ) కార్యకర్త విష్ణును నిందితులు కత్తులు, ఇనుప రాడ్ లతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటనలో మొత్తం 16 మందిపై కేసు నమోదు కాగా... 11 మందికి రెండు పర్యాయాల జీవితఖైదును కోర్టు విధించింది. మరొక నిందితుడికి జీవతఖైదు, మరొకరికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. ఒక వ్యక్తిని మాత్రం నిర్దోషిగా విడుదల చేసింది. ఒక నిందితుడు 2008లో చనిపోగా... ఒక వ్యక్తి మాత్రం పరారీలో ఉన్నాడు.