: అరాచక శక్తులను అణచివేస్తాం.. ఎదురుకాల్పుల్లోనే నయీమ్ హతం: అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన
చేసిన పాపాలు పండడంతో ఇటీవల తెలంగాణ పోలీసుల చేతిలో హతమైన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు అంశంపై ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రజల ఫిర్యాదుల ఆధారంగా నయీమ్ గ్యాంగ్‌పై మొత్తం 174 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు నయీమ్‌కు సంబంధించిన 27 ఇళ్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. తమ ప్రభుత్వం నయీమ్ లాంటి వారు చేస్తోన్న అకృత్యాలను ఏ మాత్రం సహించబోదని అన్నారు. అరాచక శక్తులను అణచివేస్తామని ఉద్ఘాటించారు. నయీమ్ అక్రమాలపై రెండు ఛార్జిషీట్లు దాఖలు చేశామని, మరో 15 ఛార్జిషీట్లు దాఖలు చేస్తున్నామని, త్వరలోనే వాటిని కోర్టుకు అందజేస్తామని అన్నారు.
ఆగస్టు 8న ఆయుధాలతో మిలీనియం టౌన్ షిప్ లో నయీమ్ సంచరించాడని, ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ స్థలానికి చేరుకున్నారని, ఆ సమయంలో జరిగిన ఎదురుకాల్పుల్లోనే నయీమ్ హతమయ్యాడని కేసీఆర్ ప్రకటించారు. ఘటనాస్థలంలో ఏకే 47తో పాటు మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారని అన్నారు. నయీమ్ నేర చర్యలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందని అన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధ్వర్యంలో నాలుగు టీమ్‌లు నయీమ్ కేసును దర్యాప్తు చేశాయని చెప్పారు.