: చెన్నైను వణికిస్తున్న ఈగల భయం
వార్ధా తుపానుతో వణికిపోయిన చెన్నై మహానగరానికి ఇప్పుడు ఈగల భయం పట్టుకుంది. ఇప్పటికీ వీధుల్లో చెట్ల కొమ్మలు, ఆకులు, చెత్తాచెదారం పేరుకుపోయి ఉండడంతో ఈగల సంతతి భారీగా పెరిగి అంటు వ్యాధులు ప్రబలుతాయేమోనని అక్కడి అధికారులు కలవరం చెందుతున్నారు. తేమతో కూడిన వాతావరణంలో ఈగలు వారం రోజుల్లోనే తమ సంతతిని ఉత్పత్తి చేయగలవని, వాటిని నివారించకుంటే పెద్ద సమస్యగా పరిణమిస్తాయని ప్రజారోగ్యం విభాగం డైరెక్టర్ కె.కొలండైసామి తెలిపారు.
ఈగలు ఆహారం, నీటిని కలుషితం చేస్తాయని, దాంతో తీవ్రమైన గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రోడ్లపై పడిపోయిన చెట్ల కొమ్మలను తక్షణమే తొలగించడం సాధ్యం కాకపోతే వాటిపై కీటక నాశనులను చల్లాలని నగరపాలక సంస్థను ప్రజారోగ్య విభాగం కోరింది. వార్థా తుపాను కారణంగా చెన్నై వీధుల్లో 44,000 టన్నుల చెత్త పేరుకుపోయింది. దీంతో ప్రాధాన్యం మేరకు తొలుత ప్రధాన రహదారుల్లో వాహన రాకపోకలకు వీలుగా సిబ్బంది చెత్తను తొలగిస్తున్నారు.