demonitisation: ఖాతాదారులతో ఆడుకుంటున్నారు.. బ్యాంకు వద్ద నగదు విత్‌డ్రా ఫారం ఒక్కోటి రూ.10
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో అసలే తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలతో దళారులు, బ్యాంకుల సిబ్బంది ఆడుకుంటున్నారు. బ్యాంకుల ముందు చేరుకుంటున్న కొందరు దళారులు ప్రజల అవస్థలను ఆసరాగా తీసుకొని వృద్ధులు, బ్యాంకులో ఫారాలను నింపలేని వారి వద్ద నుంచి డబ్బులు లాగుతున్నారు. ఖాతాదారుల డిపాజిట్, విత్‌డ్రా ఫారంలు నింపి ఇస్తామని గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వద్ద ఓ దళారీ గ్యాంగ్ ఒక్కో విత్‌డ్రా ఫారానికి రూ.10 చొప్పున తీసుకుంటోంది. ఈ విషయం తెలిసినప్పటికీ బ్యాంకు సిబ్బంది పట్టించుకోవడం లేదు.
బ్యాంకులో వాటిని ఉచితంగా తీసుకొని బ్యాంకు బయటకు వచ్చి వాటిని ఖాతాదారులకు అమ్ముకుంటూ మీడియా కంటపడ్డారు. ఆ ఫారంతోపాటు పూర్తిచేసి ఇవ్వడానికి రూ.10 తీసుకుంటున్నారు. ఇక చదువురాని వారు తప్పని పరిస్థితుల్లో డబ్బులు చెల్లించుకొని ఫారాలను తీసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బ్యాంకులకు ఖాతాదారులు వందల సంఖ్యలో వస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి పదిరూపాయలు తీసుకున్నా అంతాకలిపి దళారులకు వేల రూపాయల్లోనే వస్తున్నాయి. దళారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ఖాతాదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, విత్‌డ్రా ఫారాలు దళారుల చేతికి చిక్కకుండా, తమకు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.