: అంతన్నాడింతన్నాడు.. చివరికి మట్టికరిచాడు.. భారత్ బాక్సర్ దెబ్బకు తోకముడిచిన 'చెకా' .. టైటిల్ నిలబెట్టుకున్న విజేందర్ సింగ్!
ఇటీవల పరిచయ కార్యక్రమంలో విజేందర్‌ను స్టేజిపైనే దుర్భాషలాడిన టాంజానియా బాక్సర్ ఫ్రాన్సిస్ చెకా తోకముడిచాడు. భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ దెబ్బకు పది నిమిషాల్లోనే మట్టికరిచాడు. ప్రొఫెషనల్ కెరీర్‌లో వరుసగా ఎనిమిదో విజయాన్ని ఖాతాలో వేసుకున్న విజేందర్ సొంతగడ్డపై డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. విజేందర్ కెరీర్‌లో ఇది ఏడో నాకౌట్ విజయం.
శనివారం ఢిల్లీలో జరిగిన ఫైట్‌లో విజేందర్ తనకంటే ఎంతో బలవంతుడైన, 32 బౌట్‌లు, మూడు వందల రౌండ్‌లు ఆడిన అనుభవమున్న చెకాను ఎదుర్కొన్నాడు. అయితే తొలినుంచి పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించిన విజేందర్ చెకాను టెక్నికల్ నాకౌట్ చేశాడు. పది రౌండ్‌ల ఫైట్‌ను మూడు రౌండ్లలోనే ముగించాడు. విజేందర్ విసిరిన విన్నింగ్ పంచ్‌కు చెకా బిత్తర పోగా, రిఫరీ మ్యాచ్‌ను నిలిపివేసి టెక్నికల్ నాకౌట్ కింద విజేందర్‌ను విజేతగా ప్రకటించాడు. ఇటీవల పరిచయ కార్యక్రమంలో చెకా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. విజేందర్‌ను తాను లెక్కచేయనని, 17న తన తడాఖా చూపిస్తానని విజేందర్‌పైకి వేలు చూపించి మరీ రెచ్చగొట్టాడు. అయితే సహనం కోల్పోని విజేందర్ 17న తానేంటో నిరూపిస్తానని పేర్కొన్నాడు. అనుకున్నట్టే చెకాను మట్టికరిపించి టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు.