: అమీర్ తల్లి కోరిందనే ఆ నటిని ‘దంగల్’ లో తీసుకున్నారట!
ఈ నెల 23న బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ తాజా చిత్రం ‘దంగల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ కు భార్య పాత్రలో సాక్షి తన్వార్ నటించింది. వాస్తవానికి, సాక్షి తన్వార్ బుల్లితెర నటి. పెద్ద హీరో అయిన అమీర్ సరసన, అదీ ఎంతో ప్రతిష్టాత్మక చిత్రమైన ‘దంగల్’లో ఆమెకు ఎలా అవకాశం లభించిందనే అనుమానాలు రాకమానవు. ఈ అనుమానాన్ని స్వయంగా అమీరే తీర్చేశారు. తన తల్లి జీనత్ హుస్సేన్.. సాక్షి తన్వార్ కు పెద్ద ఫ్యాన్ అని, దీంతో, ‘దంగల్’ సినిమాలో నటించేందుకు ఆమెకు అవకాశమివ్వాలని అమీర్ కు చెప్పారట.
తల్లి మాట కాదనలేకపోయిన అమీర్, ఈ విషయాన్ని దర్శకుడు నితీష్ తివారీకి చెప్పాడట. సాక్షి తన్వార్ హర్యానా ప్రాంతానికి చెందిన మహిళ కావడం, అక్కడి సంప్రదాయాలకు ఆమె బాగా సూటవుతుందని నితీష్ భావించాడు. ఆ విధంగా, సాక్షి తన్వార్ కు ఇందులో అవకాశం లభించిందని అమీర్ చెప్పుకొచ్చాడు.