: పెద్దనోట్ల రద్దు ప్రభావం: మన దేశంలో కంటే వెనిజులాలో పరిస్థితి అత్యంత దారుణం.. దోపిడీకి దిగుతున్న ప్రజలు
భారత్‌లో పెద్దనోట్లను రద్దు చేసిన అనంతరం తలెత్తిన కష్టాలు ఏ పాటివో అందిరికీ తెలిసిందే. అయితే, వెనిజులాలోనూ ఇటీవలే వంద బొలివర్ నోట్లను రద్దు చేశారు. డిసెంబర్ 15వ తేదీ నుంచి మూడు రోజుల్లోగా పాత నోట్లను మార్చుకోవాలని ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మడురో ప్రకటించారు. ఈ రోజుతో ఆ గడువు ముగుస్తుంది. అయితే, పెద్దనోటు రద్దు నేపథ్యంలో ఆ దేశ ప్రజలు అసహనంతో వున్నారు. కొత్త నోట్లు దొరక్క, పాత నోట్లు చెల్లక ఏం చేయాలో తెలియక డెలివరీ ట్రక్కులను దోచుకుంటుంటూ పోలీసులతో గొడవలకు దిగుతూ రెచ్చిపోతున్నారు. తమదేశంలో 100 బొలివర్ నోట్లను రద్దు చేసిన ఆ దేశ ప్రభుత్వం ఆ స్థానంలో వాటి విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ నోట్లు అందుబాటులోకి తీసుకు రావాలని చూస్తోంది. అయితే, ఆ నోట్లు ఇప్పటివరకు సామాన్యులకు అందలేదు.
ద్రవ్యోల్బణం దారుణమైన స్థాయిలో ఉన్న ఆ దేశంలో పెద్దనోటు రద్దు చేయడంతో ప్రజలు మరిన్ని కష్టాలతో రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతున్నారు. సరఫరా చేయడానికి కొత్తనోట్లను సిద్ధం చేయకముందే ముందు జాగ్రత్తలేమీ తీసుకోకుండానే 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రకటించారు. 100 బొలివర్ విలువ అమెరికా కరెన్సీలో మూడు సెంట్లు మాత్రమే విలువ చేస్తుంది. ఆ దేశంలో ఆ నోట్లు 77 శాతం వరకు చలామణీలో ఉండేవి. ఒక్కసారిగా వాటిని రద్దు చేయడంతో మరి కొన్ని రోజుల్లో క్రిస్మస్ పండుగ రానుండడం వారి కష్టాలను మరింత పెంచేసింది. కనీసం ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి కూడా జనం దగ్గర డబ్బులు లేకపోవడంతో నిరసనలు వెల్లువెత్తాయి.
మరకైబో నగరంలో ఆందోళనకు దిగిన ప్రజలు పోలీసులపై రాళ్లు విసిరారు. మటురిన్ నగరంలో ఒక పెద్ద మాల్‌ను డజన్ల కొద్దీ ప్రజలు దోచుకోవడం కలకలం రేపింది. మరోవైపు పోలీసులు చూస్తుండగానే ఒక చికెన్ ట్రక్కును కొందరు దోచుకున్నారు. నగదుకోసం బ్యాంకులకు వెళుతున్న ఖాతాదారులు నగదు అందుకోకపోవడంతో సహనం కోల్పోయి దోపిడీలకు పాల్పడుతున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
శాంటా బార్బరా నగరంలో బ్యాంకు నగదును తీసుకెళ్తున్న ట్రక్కును కొంతమంది వ్యక్తులు దోచుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వారిపై ట్రక్కు డ్రైవర్లు కాల్పులు జరపడంతో నలుగురు వ్యక్తులు గాయాలపాలయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వెనిజులా రిజర్వు బ్యాంకులో మాత్రమే 100 బొలివర్ నోట్లను మార్చుకునే వీలుంది. దీంతో రిజర్వు బ్యాంకు శాఖల ముందు వేలాది మంది క్యూలో నిలబడుతున్నారు. పాతనోట్లను తీసుకొని వాటికి 'ప్రత్యేక ఓచర్లు' ఇస్తున్నారే తప్ప కొత్తనోట్లు ఇవ్వడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము అష్టకష్టాలు పడుతున్నట్లు చెబుతున్నారు.