: విమానం ఎక్కడానికి గుర్తింపు కార్డు అవసరం లేదు... వేలిముద్ర ఉంటే చాలు!
కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే... ఇది వాస్తవ రూపంలోకి రానుంది. ఇప్పటిదాకా విమానాశ్రయంలోకి వెళ్లడానికి వ్యక్తిగత గుర్తింపు కార్డును తీసుకెళుతున్నాం. ఇకపై ఇది అవసరం లేదు. డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కడానికి కేవలం వేలి ముద్ర చాలు. పౌర విమానయాన శాఖ ఇప్పటికే దీనిపై కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయంలో బయోమెట్రిక్ పద్ధతిని పైలట్ ప్రాజెక్టుగా విజయవంతంగా అమలుచేస్తున్నారు.
ఇప్పటి వరకు మన దేశంలో 100 కోట్ల మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు. ఆ కార్డులను పొందే సమయంలో వేలి ముద్రలు, ఐరిస్ స్కాన్ చేసి, డిజిటల్ రిజిస్ట్రీలో ఫీడ్ చేశారు. దీంతో, వేలి ముద్ర వేస్తే, మన వివరాలు మొత్తం స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతాయని... టికెట్ మీద ఉన్నది, ఆధార్ వివరాలు మ్యాచ్ అయితే చాలు టెర్మనల్ వద్దకు వెళ్లి, విమానం ఎక్కేయవచ్చని పౌర విమానయాన శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.