: మోదీపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత... ఆయనతోనే సమావేశమైన రాహుల్ గాంధీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడ్డారని... దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై తాను మాట్లాడితే భూకంపం వస్తుందని... అందుకే పార్లమెంటులో తనను మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో, ఈ ఉదయం ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.
పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా, పెద్ద నోట్ల రద్దుతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి రాహుల్ తీసుకెళ్లారు. అంతేకాక, రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేసే అంశంపై కూడా చర్చించారు. రుణమాఫీ అంశంపై మోదీకి ఓ నివేదికను కూడా సమర్పించారు. ఈ భేటీకి రాహుల్ తో పాటు మల్లికార్జున ఖర్గే, గులాం నబీ అజాద్, ఆనంద్ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా, రాజ్ బబ్బర్ తదితరులు హాజరయ్యారు.