: రద్దయిన పెద్ద నోట్లు 'చిత్తు కాగితాలు' కాదు.. కాస్త ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్న సంస్థలు!


రద్దయిన పెద్దనోట్లు ఇక 'చిత్తు కాగితాలే'నని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. బ్యాంకుల్లో పెద్దనోట్లు జమచేసుకునే సమయం కూడా దగ్గరపడుతోంది. దీంతో ఇక తమ వద్ద ఉన్న కొద్దిపాటి పాత నోట్లను జమచేసేందుకు ప్రజలు బ్యాంకుల వద్ద క్యూకడుతున్నారు. అయితే రద్దయిన పాతనోట్లు చిత్తుకాగితాలు కాదంటూ కొన్ని సంస్థలు, వ్యక్తులు వాటిని 5-6 శాతం ప్రీమియంతో కొనుగోలు చేసేందుకు పోటీపడుతున్నారు. ఫలితంగా ఒక్కసారిగా పాత నోట్లకు గిరాకీ పెరిగింది. మరో 15 రోజుల్లో మొత్తం విలువను కోల్పోయే పెద్దనోట్లను కొనుగోలు చేసేందుకు వీరు ముందుకు వస్తున్నారు. రికార్డుల్లో చూపించిన విధంగా నగదు నిల్వలు లేని కంపెనీలు, వ్యాపారులు వాటిని కొంత శాతం ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసి, తమ బ్యాలెన్స్ షీట్లను సరిచేసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు.
 
సాధారణంగా కంపెనీలు, వ్యాపారులు తమ బ్యాలెన్స్ షీట్లలో కొంత క్యాష్‌ను ఇన్ హ్యాండ్ కింద చూపిస్తారు. ఇది పూర్తిగా ‘వైటే’. రోజువారీ ఖర్చుల కోసం ఈ సొమ్మును వినియోగిస్తారు. కొన్నిసార్లు ఈ సొమ్మును అధికారులకు లంచాలు ఇచ్చేందుకు కూడా వాడుకుంటారు. అంతేకాదు లెక్కల్లో చూపే వెసులుబాటు లేని కొనుగోళ్ల కోసం వాడుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలు సమయంలో ఈ సొమ్ముకు భలే గిరాకీ. రిజిస్ట్రేషన్ ధరకు, డీల్‌కు మధ్య ఉన్న తేడాను ఈ సొమ్ముతో కప్పేస్తారు. ఈ ‘క్యాష్ ఇన్ హ్యాండ్’ సొమ్ముకు లెక్కలు మాత్రం పక్కాగా ఉండాలి. అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ లెక్కను ‘సరి’ చేయడం ఆయా సంస్థలు, వ్యాపారులు, వ్యక్తులకు తలనొప్పిగా మారింది. క్యాష్ ఇన్ హ్యాండ్ మొత్తాన్ని కూడా బ్యాంకులో జమచేయాల్సి రావడంతో ఏం చేయాలో తెలియక తిప్పలు పడుతున్నారు. అందుకే పాత కరెన్సీ కోసం పరుగులు పెడుతున్నారు. రూ.కోటి కోసం అవసరమైతే మరో ఐదారు లక్షల రూపాయలు అదనంగా ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. 

నిన్నమొన్నటి వరకు తమ వద్ద ఉన్న నల్లడబ్బును 30-40 శాతం మార్జిన్ ఇచ్చి మార్చుకునేందుకు నల్లబాబులు ఆపసోపాలు పడితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఐదు నుంచి ఆరు శాతం ప్రీమియంతో తామే కొనుగోలు చేస్తామని కంపెనీలు ముందుకు వస్తుండడంతో ఇప్పుడు  నల్లబాబులు తెగ బాధపడిపోతున్నారు. మరోవైపు క్యాష్ ఇన్ హ్యాండ్‌ను ఈ నెల 30లోపు ఏదోలా సర్దుబాటు చేసి బ్యాంకుల్లో కచ్చితంగా జమచేయాల్సి రావడంతో కంపెనీలు పాత నోట్ల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. అయితే ఇప్పటికే రద్దయిన నోట్లలో 85 శాతం బ్యాంకులకు చేరడంతో ఉన్న 15 శాతం కోసం పోటీ మొదలైంది. దీంతో వాటికి డిమాండ్ కూడా పెరిగింది. 
 

  • Loading...

More Telugu News