: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవికి శశికళ అనర్హురాలంటూ పార్టీ బహిష్కృత ఎంపీ హైకోర్టులో పిటిషన్
అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి శశికళా నటరాజన్ అనర్హురాలంటూ మద్రాసు హైకోర్టులో ఆ పార్టీ బహిష్కృత ఎంపీ శశికళా పుష్ఫ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలంతా కలిసి ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంటుందని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. శశికళ నటరాజన్ ను ఏ హోదాతో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటారని ఆమె పిటిషన్ లో ప్రశ్నించారు. జయలలిత మరణంపై తమకు చాలా అనుమానాలున్నాయని ఆమె పిటిషన్ లో తెలిపారు. దీనిపై న్యాయవిచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. నల్లధనం భారీఎత్తున బయటపడ్డ శేఖర్ రెడ్డి, శశికళ మధ్య బంధాన్ని బయటపెట్టాలని ఆమె కోరారు. శేఖర్ రెడ్డి ఇంట్లో దొరికిన డబ్బంతా శశికళదేననే ప్రచారం ఉందని ఆమె వెల్లడించారు.
గతంలో జయలలితను చంపేందుకు శశికళ ప్రయత్నించారని ఆమె గుర్తుచేశారు. అప్పుడే శశికళను జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారని ఆమె తెలిపారు. అప్పటి నుంచి శశికళ కుటుంబాన్ని జయలలిత ఏనాడూ క్షమించలేదని అన్నారు. అలాంటిది జయలలిత ఇంట్లో శశికళ, ఆమె భర్త ఎందుకుంటున్నారని ఆమె నిలదీశారు. జయలలిత హత్యలో కుట్ర లేకపోతే, అప్పటి వరకు సంబంధం లేనట్టున్న శశికళ కుటుంబ సభ్యులు ఆమె పార్థివదేహం చుట్టూ ఎందుకు నిలబడాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు. దీంతో తమిళనాట పెను కలకలం రేగుతోంది. మరోవైపు డీఎంకే నేత స్టాలిన్ కూడా కేంద్రాన్ని విచారణ కోరడంతో ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందోనని ఆసక్తి రేగుతోంది.