: పార్టీ మారిన రోజు రాత్రే సర్పంచ్ వాహనాలను తగుల బెట్టిన దుండగులు!
కృష్ణా జిల్లా నిడమానూరు సర్పంచ్ కోటేశ్వరరావు కారు, ద్విచక్రవాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు నిన్న అర్ధరాత్రి తగులబెట్టారు. ఆయన టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన నాటి రాత్రే ఈ సంఘటన జరగడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ, నిన్న రాత్రి ఒంటి గంట ప్రాంతంలో షెడ్ లో ఉన్న తన వాహనాలకు నిప్పు పెట్టారని, ఇది ప్రత్యర్థుల పనేనని ఆయన ఆరోపించారు. తన వాహనాలను తగులబెట్టడం దారుణమని అన్నారు. మూడున్నరేళ్లుగా టీడీపీలో కొనసాగానని, ప్రస్తుతం తనకు ఆ పార్టీలో స్వేచ్ఛలేదని, అందుకే, తాను పార్టీ మారానని చెప్పారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.