: టీఎస్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచే...నోట్ల రద్దుపై చర్చ వద్దన్న కేసీఆర్... పట్టుబట్టిన కాంగ్రెస్, ఎంఐఎం!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ 30 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. 18, 24, 25 తేదీల్లో సమావేశాలు ఉండవు. ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఈ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
రేపు ఉదయం పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి చర్చ జరగనుంది. ఇప్పటికే పార్లమెంటులో ఈ అంశం గందరగోళానికి కారణమైందని... అసెంబ్లీలో కూడా ఎందుకని ముఖ్యంత్రి కేసీఆర్ అన్నారు. కానీ, ఈ అంశంపై చర్చించాలంటూ కాంగ్రెస్, ఎంఐఎం పట్టుబట్టడంతో... చర్చకు అంగీకారం తెలిపారు.
బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, హరీష్ రావు, ప్రతిపక్ష నేత జానారెడ్డి, భట్టి విక్రమార్క, కిషన్ రెడ్డి, సున్నం రాజయ్య, సండ్ర వెంకట వీరయ్య, అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు హాజరయ్యారు.