yahoo: అతిపెద్ద సైబర్‌ నేరం.. వందకోట్ల అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయని ప్రకటించిన యాహూ!


మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో ఇప్ప‌టికే వెనకబడిపోయిన ప్ర‌ముఖ సెర్చింజ‌న్‌ యాహూ తాజాగా మరిన్ని కష్టాల్లో పడింది. కొన్ని రోజుల క్రిత‌మే స‌ద‌రు సంస్థ‌ ఇంటర్నెట్‌ వ్యాపారాన్ని అమెరికా టెలికాం కంపెనీ వెరిజాన్‌ 4.8 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఇప్పుడు యాహూ అమ్మ‌కాల‌పై  ప్ర‌భావం ప‌డే విధంగా ఈ కంపెనీకి చెందిన‌ దాదాపు 100 కోట్ల (1బిలియన్‌)కు పైగా ఖాతాల నుంచి వ్యక్తిగత సమాచారం అపహరణకు గురైంది. ఈ విష‌యాన్ని యాహూ సంస్థే ప్ర‌క‌టించింది. మూడేళ్ల క్రితమే ఈ సమాచారం హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిపిన యాహూ.. మూడు నెలల క్రితం కూడా ఇలాగే త‌మ యూజర్లకు చెందిన అకౌంట్ల వివ‌రాలు అప‌హ‌ర‌ణ‌కు గురి అయినట్లు తెలిపింది.
 
2014లోనూ యాహూ తమ నెట్‌వర్క్‌ నుంచి 50 కోట్ల అకౌంట్ల వివ‌రాలు హ్యాకింగ్‌కు గుర‌య్యాయ‌ని తెలిపింది. 50 కోట్ల యూజ‌ర్ల స‌మాచారం హ్యాకింగ్ కి గుర‌వ‌డ‌మనేది ఇప్పటి వరకు అతిపెద్ద సైబర్‌ నేరంగా ఉంది. అయితే, తాజాగా 100 కోట్ల అకౌంట్లు హ్యాకింగ్ గుర‌య్యాయ‌ని తెలప‌డం క‌ల‌క‌లం రేపుతోంది. గతంలో త‌మ యూజ‌ర్ల వివ‌రాల‌ను త‌స్క‌రించిన హ్యాక‌ర్లు అప్ప‌టి లాగే ఇప్పుడు కూడా  యూజ‌ర్ల‌ పేర్లు, ఈమెయిల్‌ ఐడీలు, టెలిఫోన్‌ నంబర్లు, పాస్‌వర్డ్‌లతో పాటు, ఎన్‌క్రిప్టెడ్‌, అన్‌ ఎన్‌క్రిప్టెడ్‌ సెక్యూరిటీ ప్రశ్నలు, సమాధానాలు అప‌హ‌రించిన‌ట్లు స‌ద‌రు సంస్థ తెలిపింది. అయితే త‌మ యూజ‌ర్ల‌కు సంబంధించిన‌ బ్యాంక్‌ అకౌంట్‌ సమాచారం, పేమెంట్‌ డేటా మాత్రం అప‌హ‌ర‌ణ‌కు గురికాలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నేప‌థ్యంలో త‌మ యూజ‌ర్ల‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తూ త‌మ‌ పాస్‌వర్డ్‌లు, సెక్యూరిటీ ప్రశ్నల సమాధానాలు మార్చుకోవాలని యూహూ పేర్కొంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News