: గాంధీ ఆసుపత్రిలో ఘోరం... చిన్నారికి పురుగులు ఉన్న సెలైన్ ఎక్కించిన వైనం
హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి వెలుగు చూసింది. ప్రవల్లిక అనే ఆరేళ్ల చిన్నారికి పురుగులున్న సెలైన్ బాటిల్ ఎక్కించడంతో... ఆమె పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, జ్వరంతో బాధపడుతున్న ప్రవల్లికను ఆమె తల్లిదండ్రులు 7వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి ఈ ఉదయం 7.30 గంటల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత నిర్లక్ష్యంతో పురుగులున్న సెలైన్ ను హాస్పిటల్ సిబ్బంది ఆ చిన్నారికి ఎక్కించారు. దీంతో, వెంటనే ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టమయింది. ఆమె శరీరం ఎర్రటి రంగులోకి మారింది. ఇది జరిగిన వెంటనే తాను వైద్యుల దృష్టికి తీసుకెళ్లానని ఆమె తండ్రి చెప్పాడు. సెలైన్ బాటిల్ ను తమకు ఇవ్వాలని... ఈ విషయాన్ని మీడియా దృష్టికి ఎందుకు తీసుకెళ్లావంటూ వైద్యులు ప్రశ్నిస్తున్నారని తెలిపాడు. మీ కూతురు చావు బతుకుల్లో ఉందని... వెంటనే వెంటిలేటర్ పెట్టాలని... ఆ బాటిల్ తీసుకొచ్చి తమకు ఇవ్వాలని డాక్టర్లు ఒత్తిడి చేస్తున్నారని చెప్పాడు.