: స్మార్ట్ ఫోన్ మోజు: ఆన్లైన్లో ఫోన్ ఆర్డర్.. డెలివరీ బోయ్ మర్డర్.. !
చేతిలో డబ్బు లేదు.. బ్యాంకులో బ్యాలెన్సు లేదు.. అయినప్పటికీ స్మార్ట్ఫోనుపై అతడికి ఎంతో మోజు ఉంది. డబ్బులేకపోయిన్పటికీ ఆన్లైన్లో ఫోను ఆర్డరు చేశాడు. డెలివరి బోయ్ ఫోనుని తీసుకొని వచ్చాడు.. అయితే, డెలివరి బోయ్ని చంపి తనకు కావాల్సిన ఫోనుతో పాటు మరో ఫోను, పదివేల రూపాయలు లాక్కున్నాడు బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో డెలివరీ బోయ్‌గా పనిచేస్తున్న నంజుండస్వామి (29) రెండు రోజులుగా కనిపించడం లేదు. ఈ విషయమై అతని తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తోన్న పోలీసులకి ఫ్లిప్‌కార్డు సిబ్బంది ఓ సమాచారం అందించారు. స్వామి ఫోన్ డెలివరీ చేయడానికి ఓ జిమ్ కు వెళ్లాడని, అప్పటి నుంచి కనిపించడం లేదని వారు పేర్కొన్నారు.
దీంతో బెంగళూరులోని విజయనగర్ ప్రాంతంలో గల ఓ భవనం వద్దకు వెళ్లి చూసిన పోలీసులకి లిఫ్టు షాఫ్టులో స్వామి మృతదేహం లభించింది. మరింత లోతుగా ఆరా తీసిన పోలీసులకి స్వామిని చంపేసింది కె. వరుణ్‌కుమార్ (22) అనే జిమ్ ట్రైనర్ అని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు మీడియాకు తెలుపుతూ పది రోజుల క్రితమే జిమ్‌లో చేరిన వరుణ్ వద్ద అప్పటి వరకు ఫోన్ లేదని, తనతో పాటు పనిచేస్తోన్న అతడి స్నేహితులు, క్లయింట్ల వద్ద మంచి ఫోన్లున్నాయని చెప్పారు.
మెకానిక్‌గా పనిచేసే తన తండ్రిని డబ్బులు కావాలని వరుణ్‌కుమార్ అడిగాడని, అయితే తన తండ్రి డబ్బు ఇవ్వలేదని చెప్పారు. అయినా ఫోనుపై మోజుతో చేతిలో డబ్బులు లేకపోయినా, రెడ్మి నోట్ 3 ఫోన్ కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసిన వరుణ్ తన జిమ్ ల్యాండ్‌లైన్ నంబరు ఇచ్చాడని, ఇటీవలే మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో నంజుండ స్వామి జిమ్ వద్దకు ఫోను డెలివరీ తీసుకుని రాగా అతడిని చూసిన వరుణ్ భవనంలోని సెకండ్ ఫ్లోర్‌లోకి పిలిచాడని పోలీసులు తెలిపారు.
అనంతరం డెలివరీ బోయ్ స్వామి నుంచి ఫోన్ లాక్కోడానికి వరుణ్ ప్రయత్నించాడని, తప్పించుకుని బయటకు పారిపోతోన్న స్వామిని వరుణ్ వెనక నుంచి ఒక ఫ్లవర్ వాజ్‌తో అతడి తలమీద కొట్టాడని పోలీసులు తెలిపారు. దీంతో స్వామి స్పృహతప్పి పడిపోయాడని, అనంతరం అతడి గొంతును ఓ కత్తితో కోసి వరుణ్ హత్య చేశాడని సుమారు పదిగంటల పాటు శవాన్ని అక్కడే అలాగే వదిలేసి, ఆ తరువాత లిప్టు షాఫ్ట్‌లో పారేశాడని పోలీసులు తెలిపారు. డెలివరీ బోయ్ నుంచి రెండు స్మార్ట్ ఫోన్లతో పాటు పదివేల రూపాయల నగదు, డెలివరీ కోసం తెచ్చిన ఇతర వస్తువులు తీసుకున్న వరుణ్ అక్కడి నుంచి పరారయ్యాడని, తాను కాజేసిన రూ. 24వేల విలువైన హెచ్‌టీసీ ఫోన్‌ను మరో స్నేహితుడికి ఇచ్చాడని తెలిపారు. అనంతరం వరుణ్ జిమ్ ఓపెన్ చేయలేదని, చివరకు అతడిని అరెస్టు చేసి విచారించామని పోలీసులు తెలిపారు.